కాట్రపల్లి శివ కోటేశ్వర ఆలయాన్ని సందర్శించిన వేం నరేందర్ రెడ్డి

కాట్రపల్లి శివ కోటేశ్వర ఆలయాన్ని సందర్శించిన వేం నరేందర్ రెడ్డి
కేసముద్రం, ఆంధ్రప్రభ: వేం నరేందర్ రెడ్డి గురువారం కాట్రపల్లి గ్రామంలోని పురాతన శ్రీశివ కోటేశ్వర ఆలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా స్వగ్రామ ప్రాంతానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్, టీపీసీసీ సభ్యుడు గుగులోతు దసురు నాయక్, సర్పంచ్ ఎదరబోయిన సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ చారిత్రక ఆలయం గ్రామ ప్రజలకు గర్వకారణమని అన్నారు. గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
శివ కోటేశ్వర ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా రూ.4 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. త్వరలోనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే అర్పణపల్లి గ్రామం నుంచి నాగారం గ్రామం వరకు ఆరు కిలోమీటర్ల బీటీ డబుల్ రోడ్డు నిర్మాణానికి మంజూరు కల్పిస్తామని చెప్పారు. గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటి బావి ఏర్పాటు చేయిస్తామని, గ్రామ చెరువుకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటి సరఫరా కల్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కోరగా, తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి సహకరించాలని ఇచ్చిన వినతిపత్రంపై కూడా సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చాగంటి యాదగిరి, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
