పల్స్ పోలియో విజయానికి సమన్వయంతో కృషి చేయాలి
తొర్రూరు, ఆంధ్రప్రభ: ఈ నెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ బి. జ్వలిత పిలుపునిచ్చారు.గురువారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తొర్రూరు, పెద్దవంగర మండలాల కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జ్వలిత మాట్లాడుతూ, రెండు మండలాల పరిధిలో మొత్తం 60 పోలియో బూత్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5 సంవత్సరాల లోపు ఉన్న 4,778 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.అలాగే ఐదు సూపర్వైజర్ రూట్లను ఏర్పాటు చేయడంతో పాటు తొర్రూరు, పెద్దవంగర బస్టాండ్లలో ప్రత్యేక ట్రాన్సిట్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సుందరి, రమేష్, మేరీ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
