ప్రభుత్వ భూమి కాపాడాలని తహసీల్దార్‌కు వినతి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించి, సర్వే హద్దులను పునరుద్ధరించాలని గ్రామస్థులు శనివారం తహసీల్దార్ అశోక్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రంలో గ్రామస్థులు పేర్కొన్న వివరాల ప్రకారం, బిజ్వార్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 487లో ఉన్న ప్రభుత్వ భూమి గ్రామపంచాయతీ భవనం, పల్లె దవాఖానా, రైతు భవనం, సంత బజార్, ప్రభుత్వ పాఠశాలలు, బాలల సంక్షేమ భవనాలు తదితర ప్రజా అవసరాల కోసం కేటాయించబడిందన్నారు.
అయితే కొందరు వ్యక్తులు ఆ భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఏర్పాటు చేసిన హద్దులను కూడా తొలగించారని పేర్కొన్నారు.
సర్వే నంబర్ 487కు సంబంధించిన హద్దులను తిరిగి గుర్తించి పాతించాలని, అక్రమ ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని వారు కోరారు.
ప్రజా అవసరాలకు అత్యంత కీలకమైన ఈ భూమిని పరిరక్షించి, ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, బొడ్డప్పల నరసింహ, మల్లేష్, డి. గోపి, బొంబాయి అంజి తదితరులు పాల్గొన్నారు.
