బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన జయానంద్
మక్తల్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం. జయానంద్ భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. మక్తల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య ఆయనకు కమలం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని పేర్కొంటూ, బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన జయానంద్కు తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ఎం. జయానంద్ మాట్లాడుతూ, బీజేపీలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ విధానాలు, నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు నచ్చకపోవడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో బీజేపీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతమే తన లక్ష్యమని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. రాజశేఖర్రెడ్డి, జిల్లా నాయకుడు బాల్చేడ్ మల్లికార్జున్, భూత్పూర్ మాజీ సర్పంచ్ కురువ హన్మంతు, నాయకులు బి. ఆంజనేయులు, సూర్య, రాజా గౌడ్, నరేందర్ సాగర్, ఆర్. మంజునాథ్, సత్యారెడ్డి, మందిపల్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
