INDIA Bloc Posters | ఇండియా కూటమి భేటీకి ముందు రాజకీయ వేడి..
INDIA Bloc Posters | ఇండియా కూటమి భేటీకి ముందు రాజకీయ వేడి..
రాహుల్‌ను టార్గెట్ చేస్తూ ఢిల్లీలో పోస్టర్లు
INDIA Bloc Posters | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి కీలక సమావేశానికి ముందు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని రాజధానిలోని పలు ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలిశాయి.
ఈ పోస్టర్లలో ఇండియా కూటమిలోని కీలక నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను పోస్టర్లలో పొందుపరిచినట్లు సమాచారం.
ఇండియా కూటమి సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు ఈ పోస్టర్లు వెలువడటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కూటమి ఐక్యత, నాయకత్వ అంశాలపై మళ్లీ చర్చ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజధానిలోని ప్రధాన కూడళ్లలో ఈ పోస్టర్లు కనిపించడంతో రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్య చర్చ జరుగుతోంది. పోస్టర్ల వెనుక ఎవరున్నారనే విషయంపై స్పష్టత లేకపోయినా, ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
