లక్ష్మీనరసింహస్వామికి భక్తుల విశిష్ట కానుక..
- 51 సాలగ్రామాలతో వెండి దండ సమర్పించిన దాతలు
కైకలూరు, ఆంధ్రప్రభ : కైకలూరు మండలం వరహాపట్నం గ్రామంలోని శ్రీ భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారికి రూ.3,53,520 విలువైన 51 సాలగ్రామాలతో రూపొందించిన వెండి దండను సమర్పించారు. దాతలు ఆనుమోలు నవీన్, స్వాతి దంపతుల ఆర్థిక సహకారంతో ఈ వెండి దండను తయారు చేయించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ దేవస్థానాన్ని సందర్శించి వెండి దండను ఆలయ అర్చకులు, దేవస్థానం సిబ్బందికి అధికారికంగా అందజేశారు.
అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
