గొడ్డలితో నరికి.. వితంతువు దారుణ హత్య

- కొండపల్లి పారిశ్రామికవాడలో పట్టపగలే దారుణం
- హతురాలు శ్రామిక నగర్ వాసి
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11 (ఆంధ్రప్రభ): కొండపల్లి పారిశ్రామికవాడలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. దుండగులు ఓ వితంతువుపై లైంగిక దాడి చేసి.. ఆపై ఆమెను కిరాతకంగా గొడ్డలితో కాలు, చేయి నరికి హత్య చేశారు. మృతదేహాన్నిజాతీయ రహదారి పక్కన ముళ్ల పొదల్లో విడిచి వెళ్లారు. స్థానికులు, సేకరించిన సమాచారం ప్రకారం.. కొండపల్లి శ్రామిక నగర్ (కొత్త గేటు) చర్చి రోడ్డులో కందిమళ్ల మణి (40) పదిహేనేళ్లుగా నివసిస్తోంది. ఈమె భర్త శేషారావు అనారోగ్యంతో పదేళ్ల క్రితం మరణించాడు. కుమారుడు కృష్ణవంశీ (22) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమార్తె ఉషశ్రీ (18) పదో తరగతి వరకు చదివి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. కందిమళ్ల మణి పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది.
ముళ్లపొదల్లో మృతదేహం
కందిమళ్ల మణి రోజూలాగే శనివారం ఉదయం ఇంటి నుంచి కంపెనీలో పనికి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో జాతీయ రహదారి పక్కన జ్యోతి హోటల్ సమీపంలోని ముళ్లపొదల్లో స్థానికులు మణి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మణి మృతదేహం వద్ద కండోమ్ ప్యాకెట్లు లభించినట్లు తెలిసింది. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, మణిపై లైంగిక దాడి జరిపింది ఎవరు? ఆపై ఆమెను హత్య చేసేందుకు గల కారణాలు ఏమిటీ? ఘటనా స్థలిలో లభించిన కండోమ్ ప్యాకెట్లు ఎక్కడివి? వివాహేతర సంబంధంతోనే ఘాతుకానికి ఒడిగట్టారా? ఇలా పలు కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
