మృగశిర కార్తె వేళ చేపల మార్కెట్లలో సందడి..
మృగశిర కార్తె వేళ చేపల మార్కెట్లలో సందడి..
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: మృగశిర కార్తె సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాల్లో చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ప్రజలు మార్కెట్లకు చేరుకుని చేపల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు.
చేపల ప్రియులతో మార్కెట్లు సందడిగా మారగా, వ్యాపారులు చేపలను కిలో రూ.250, బొమ్మ చాపను రూ.450 చొప్పున విక్రయించారు.
మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే సాంప్రదాయ విశ్వాసంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు. దీంతో మార్కెట్లలో వ్యాపారం జోరుగా సాగింది.
ఈ సందర్భంగా ఓ మత్స్యకారుడు వలలో చిక్కిన 12 కిలోల భారీ చేప మార్కెట్కు వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ చేపను చూసేందుకు పలువురు ఆసక్తి చూపుతూ ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు.
మృగశిర కార్తె నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా చేపల విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు మత్స్యకారులు తెలిపారు.
