మన ఊరు–మన భద్రతపై అవగాహన కార్యక్రమం

ప్రజల భాగస్వామ్యంతోనే శాంతిభద్రతల పరిరక్షణ: ఎస్ఐ సతీష్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: “మన ఊరు–మన భద్రత–మన బాధ్యత” పేరుతో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని కమ్మర్‌పల్లి ఎస్ఐ సీహెచ్. సతీష్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులకు ప్రజా భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ ప్రజల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

సైబర్ నేరాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మాదకద్రవ్యాల విక్రయం లేదా ఇతర నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు.

రోడ్డు భద్రతా నిబంధనల పాటింపు, సైబర్ నేరాల నివారణ, మహిళలు, చిన్నారుల భద్రత, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవల వినియోగం, పాముకాటు, విద్యుత్ షాక్ వంటి ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు.

గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.