ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు తప్పనిసరి

  • నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నందికొట్కూరు, ఆంధ్రప్రభ : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో ఎలాంటి లోపాలకు తావులేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య స్పష్టం చేశారు.

శనివారం ఉదయం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ విభాగం నుంచి ఇన్‌పేషెంట్ వార్డులు, లేబర్ రూమ్, ల్యాబ్, ఫార్మసీ విభాగాల వరకు క్షుణ్ణంగా పరిశీలించారు. రోగుల వద్దకు వెళ్లి వైద్యం సక్రమంగా అందుతోందా, మందులు అందుబాటులో ఉన్నాయా, సిబ్బంది తీరు ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యేకంగా గర్భిణులు, బాలింతల వార్డులను సందర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు, పౌష్టికాహారంపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అలాగే 104, 108 అంబులెన్స్ సేవలతో పాటు ఆసుపత్రుల్లో అవసరమైన పరీక్షలు, స్కానింగ్‌లు, మందులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.

గర్భిణులకు అవసరమైన అన్ని పరీక్షలు, టీకాలు, వైద్య సేవలు సకాలంలో అందించాలని, ప్రసవం అనంతరం తల్లీబిడ్డల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగితో, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలతో మర్యాదగా, మానవత్వంతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. వారి అవసరాలను వెంటనే తీర్చేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పూర్తిగా ఉచితమని, ఎవరైనా రోగుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేసినా సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతల నుంచి డబ్బులు డిమాండ్ చేసినా, ఇతర అక్రమాలకు పాల్పడినా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఆసుపత్రిలో ఉన్న చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

“ప్రజల ఆరోగ్యమే మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తాం. నిర్లక్ష్యం వహించే వారిని ఉపేక్షించం” అని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.