IND vs AFG Only Test | రెడ్ బాల్ ఛాలెంజ్‌కు భారత్ రెడీ..
IND vs AFG Only Test | రెడ్ బాల్ ఛాలెంజ్‌కు భారత్ రెడీ..
భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు న్యూ చండీగఢ్ వేదికగా సిద్ధమైంది. ఈ మైదానంలో తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరగనుండటంతో ఇండియా-ఆఫ్గాన్ మ్యాచ్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టు మ్యాచ్ రేపు ఉదయం 9:30 గంటలకు న్యూ చండీగఢ్‌లో ప్రారంభం కానుంది. టెస్టు క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెడుతున్న టీమిండియా, యువ ఆటగాళ్లతో కూడిన ఆఫ్ఘనిస్థాన్ జట్టును ఎదుర్కొననుంది. అభిమానుల దృష్టి సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లపై ఉండగా, ఆఫ్ఘనిస్థాన్ తరఫున రహ్మత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్ కీలకంగా మారనున్నారు.
కాగా, ఐపీఎల్ 2026 ముగిసిన కేవలం ఆరు రోజులకే ఈ టెస్టు ప్రారంభం కావడం విశేషం. అంతేకాదు, భారత జట్టులోని పలువురు ఆటగాళ్లు ఇటీవలే ఐపీఎల్ ఫైనల్ ఆడి నేరుగా టెస్టు సన్నాహకాల్లో చేరారు. వైట్ బాల్ ఫార్మాట్ నుంచి రెడ్ బాల్ క్రికెట్‌కు మారడం ఆటగాళ్లకు సవాలుగా మారనుంది. అయినప్పటికీ ఈ మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలికగా తీసుకోబోమని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్‌కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని ఆయన పేర్కొన్నాడు.
నంబర్-3లో సాయి సుదర్శన్..
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టెస్టులో భారత బ్యాటింగ్ లైనప్‌లో కీలక బాధ్యతను యువ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ మోయనున్నాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్‌నే కొనసాగిస్తామని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేయడంతో అతడిపై అందరి దృష్టి పడింది. టెస్టు క్రికెట్‌లో అత్యంత కీలకంగా భావించే నంబర్-3 స్థానంలో సాయి ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ నిర్ణయంతో దేవదత్ పడిక్కల్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మరోవైపు ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగనుండగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ రిషభ్ పంత్, ధృవ్ జురెల్ మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న సాయి సుదర్శన్.. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లో కూడా తన సత్తా చాటాలని భారత జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. కొత్త తరం బ్యాటర్లలో అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన సాయి, ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.
కుల్దీప్‌పై స్పిన్ భారం.. అరంగేట్రానికి సిద్ధమైన యువ స్పిన్నర్
భారత స్పిన్ విభాగంలో ఈ టెస్టు మ్యాచ్‌లో కొత్త ముఖం కనిపించే అవకాశం ఉంది. సీనియర్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం, రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇవ్వడం, అక్షర్ పటేల్ జట్టులో చోటు దక్కకపోవడంతో స్పిన్ బాధ్యతలన్నీ ఇప్పుడు కుల్దీప్ యాదవ్ భుజాలపై పడనున్నాయి.
జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌గా కుల్దీప్ బరిలోకి దిగుతుండగా, అతడికి వాషింగ్టన్ సుందర్ సహకారం అందించనున్నాడు. మరోవైపు యువ స్పిన్నర్లు హర్ష్ దూబే, మానవ్ సుతార్‌లలో ఒకరికి టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ ఇద్దరిలో ఎవరికీ తుది జట్టులో చోటు దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
సీనియర్ స్పిన్ త్రయం లేకపోవడంతో యువ స్పిన్నర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అరుదైన అవకాశం లభించింది. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో తొలి అడుగు పెట్టబోతున్న ఆటగాడి ప్రదర్శనపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రషీద్ లేకుండానే బరిలో ఆఫ్ఘాన్..
2018లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తోనే టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్థాన్.. అప్పట్లో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. అయితే ఎనిమిదేళ్ల తర్వాత పరిస్థితులు మారాయని, ఈసారి భారత్‌కు గట్టి పోటీ ఇస్తామని ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
అయితే, స్టార్ లెగ్-స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడం ఆఫ్ఘన్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. దాంతో, అనుభవజ్ఞుడైన రహ్మత్ షా, విధ్వంసక ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్, స్టార్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌లపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా టెస్టుల్లో ఆఫ్ఘనిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రహ్మత్ షా మరోసారి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
కొత్త హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్ పర్యవేక్షణలో బరిలోకి దిగుతున్న ఆఫ్ఘనిస్థాన్.. భారత గడ్డపై తొలి టెస్టు విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో ఉంది.
గమనించాల్సిన రికార్డులు
భారత్-ఆఫ్ఘనిస్థాన్ టెస్టులో పలు ఆసక్తికరమైన వ్యక్తిగత, జట్టు రికార్డులు అభిమానులను ఆకట్టుకోనున్నాయి. భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన కెరీర్‌లో 50వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. దాంతో భారత వికెట్ కీపర్లలో ఈ ఘనత సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరనున్నాడు.
మరోవైపు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టెస్టు క్రికెట్‌లో 3,000 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఈ ఘనతను అందుకోవాలంటే అతడు మరో 157 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లోనే ఆ మార్క్‌ను అందుకుంటాడా అనే ఆసక్తి నెలకొంది.
మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్ స్టార్ బ్యాటర్ రహ్మత్ షా కూడా ఓ ప్రత్యేక రికార్డుకు చేరువలో ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో 1,000 పరుగుల మైలురాయికి అతడు కేవలం 30 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఈ ఫీట్ సాధిస్తే టెస్టుల్లో 1,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆఫ్ఘన్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.
అంచనా జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే/మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆఫ్ఘనిస్థాన్: సెదీకుల్లా అతల్, రహ్మనుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, రహ్మనుల్లా, అఫ్సర్ జజాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, ఖైస్ అహ్మద్, జియౌర్ రెహ్మాన్.
