పోలవరం భద్రతపై ఏబీ వెంకటేశ్వరరావు ఆందోళన
పోలవరం భద్రతపై ఏబీ వెంకటేశ్వరరావు ఆందోళన
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులో గల పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) కార్యాలయంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ ఓరా, చీఫ్ ఇంజనీర్ ఎం. రమేష్ కుమార్‌లను కలిశారు.
వాటి నాణ్యత ప్రమాణాలపై ఉన్న సందేహాలు, ఆరోపణలతో కూడిన వినతిపత్రాన్ని వారికి సమర్పించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ నాణ్యత, భద్రతపై తమ వద్ద ఉన్న అనుమానాలను ఆధారాలతో సహా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భాగమైన డయాఫ్రం వాల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగా పాటించలేదని అధికారులకు వివరించినట్లు పేర్కొన్నారు.
డయాఫ్రం వాల్ ఒకసారి వరదలకు కొట్టుకుపోయిందని, ప్రస్తుతం జరుగుతున్న రెండో దశ నిర్మాణంలో కూడా పలు లోపాలు బయటపడుతున్నాయని వారు ఆరోపించారు. గోదావరి ఉగ్రరూపం దాల్చే సమయంలో ఎటువంటి పొరపాటు జరిగినా తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
డయాఫ్రం వాల్ అప్‌స్ట్రీమ్ నుంచి డౌన్‌స్ట్రీమ్ ప్రాంతాల వరకు కొన్ని చోట్ల లీకేజీలు ఉన్నట్టు తమకు సమాచారం అందిందని, అదే విషయాన్ని పీపీఏ అధికారులకు తెలియజేశామని చెప్పారు. ఇలాంటి అంశాలను ఇప్పుడే పట్టించుకోకపోతే, తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా నిర్మాణం పూర్తయ్యాక నాణ్యతా లోపాలు బయటపడే అవకాశం ఉందన్నారు.
నిర్మాణం పూర్తి కాకముందే లోపాలను గుర్తించి సరిచేస్తే ప్రజాధనం వృథా కాకుండా ఉంటుందని, లేకపోతే భవిష్యత్తులో భారీగా తవ్వకాలతో మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
పోలవరం ప్రాజెక్టు పనులన్నింటినీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సాంకేతిక నిపుణులతో సమగ్రంగా పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే హడావిడి ఎందుకని ప్రశ్నించారు.
“గోదావరి పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయి. కానీ పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు జీవితకాలంలో ఒక్కసారే నిర్మించబడుతుంది. అందువల్ల నాణ్యత, భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదు” అని స్పష్టం చేశారు.
డిజైన్ లోపాలు, అధికారుల మధ్య సమన్వయాభావం కారణంగానే గైడ్ బండ్ దెబ్బతిన్నదని ఆరోపించిన వారు, మేడిగడ్డ ప్రాజెక్టు తరహా పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అంశాలపై పీపీఏ నుంచి సరైన స్పందన రాకపోతే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ లిటిగేషన్) రూపంలో కోర్టును ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు.
