ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచండి

భక్తుల సౌకర్యాల విస్తరణకు ప్రాధాన్యత..
అన్ని మౌలిక సదుపాయాలతో మాస్టర్ ప్లాన్..
దుర్గమ్మ ఆలయ అభివృద్ధిపై కీలక చర్చలు
ఎంపీ చిన్ని తో దేవస్థాన చైర్మన్‌తో ప్రత్యేక సమావేశం
రాబోయే ప్రాజెక్టులపై విస్తృత చర్చ


( ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి ) : విజయవాడ నగరానికి ఆధ్యాత్మిక కేంద్రమైన ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి అంశాలపై కీలక చర్చలు జరిగాయి. విజయవాడ పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో దేవస్థాన పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేకంగా సమావేశమై ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు కల్పించాల్సిన ఆధునిక సౌకర్యాలు, భవిష్యత్ ప్రాజెక్టుల అమలు అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ఆలయ సమగ్రాభివృద్ధికి ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ పనుల పురోగతిని సమీక్షించారు.

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూలైన్ల విస్తరణ, తాగునీటి సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాలు, వసతి గృహాల మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యంగా పండుగలు, దసరా ఉత్సవాల సమయంలో లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కొండపైకి చేరుకునే సాధారణ భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించే దిశగా కొత్త ప్రతిపాదనలను కూడా పరిశీలించారు.

పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, డిజిటల్ సేవల విస్తరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఆలయ ఆధ్యాత్మిక వైభవానికి అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడితే దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. దేవస్థాన అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు.

Leave a Reply