అప్పికట్లలో అంబరాన్ని తాకిన ఏరువాక సంబరాలు

రైతులతో కలిసి నాగలి పట్టిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ.. భారీ ట్రాక్టర్ల ర్యాలీతో సందడి

బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ : బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణం నుంచి అప్పికట్ల గ్రామం వరకు వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించగా, రైతులు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై కిసాన్ నినాదాలతో రహదారులు మార్మోగాయి.

ర్యాలీ అనంతరం అప్పికట్ల శివాలయం సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యే ప్రత్యేక భూమి పూజ నిర్వహించారు. భూమాతకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీస్సులు పొందిన ఆయన, అప్పికట్ల గ్రామానికి చెందిన ప్రముఖ ఏరువాక గేయ రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సాంప్రదాయ పద్ధతిలో కాడెద్దులకు పూజలు నిర్వహించి స్వయంగా నాగలి పట్టి పొలాన్ని దున్నారు. ట్రాక్టర్‌ను నడిపి సాగు పనుల్లోనూ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధి స్వయంగా రైతులతో కలిసి పొలంలోకి దిగి వ్యవసాయ పనులు చేయడం రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ.. రైతన్న ముఖంలో చిరునవ్వు చూడటమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏరువాక పౌర్ణమి కేవలం పండుగ మాత్రమే కాదని, వ్యవసాయ రంగానికి కొత్త ఉత్సాహాన్ని నింపే పవిత్రమైన సందర్భంగా అభివర్ణించారు. నేలను నమ్ముకుని దేశానికి అన్నం పెడుతున్న రైతుకు ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు. పశుసంపద ద్వారా లభించే ప్రకృతి ఎరువులతో భూమి సారాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు.

ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని, డీఏపీ, యూరియా వంటి ఎరువులను బయోమెట్రిక్ విధానంలో సబ్సిడీ ధరలకు అందిస్తున్నామని చెప్పారు. ఎల్‌నినో వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ‘పొలం పిలుస్తోంది రా’ కార్యక్రమం ద్వారా రైతులకు పంటల ఎంపిక, సాగు విధానాలపై సూచనలు అందిస్తున్నారని వివరించారు.

సాగు ఖర్చులు తగ్గించేందుకు రొటవేటర్లు, ట్రాక్టర్లు, నాగళ్లు తదితర వ్యవసాయ యంత్రాలను రాయితీపై అందిస్తున్నట్లు తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా అపరాలు, మామిడి, పొగాకు వంటి పంటలకు మద్దతు ధర కల్పిస్తూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

తెలుగు సంస్కృతిలో ఏరువాక పౌర్ణమికి విశిష్ట స్థానం ఉందని, జ్యేష్ఠ పౌర్ణమి రోజున నైరుతి రుతుపవనాల రాకను ఆహ్వానిస్తూ రైతులు ఖరీఫ్ సాగుకు శ్రీకారం చుడతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో మమేకమై నాగలి పట్టడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఇనగంటి గాంధీ, రాజేష్, అమర్నాథ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.