stalin warning | స్టాలిన్ షాకింగ్ కామెంట్స్!

stalin warning | స్టాలిన్ షాకింగ్ కామెంట్స్!

టీవీకే ప్ర‌భుత్వం ఎప్పుడైనా కూలిపోవ‌చ్చు
“ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు”
పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని స్టాలిన్ పిలుపు

stalin warning | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వ భవిష్యత్తుపై డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకపోవచ్చని, ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని ఆయన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.

డీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన స్టాలిన్.. టీవీకే ప్రభుత్వం సంకీర్ణ మద్దతుతో కొనసాగుతోందని, అసెంబ్లీలో పూర్తి మెజారిటీ లేకపోవడం వల్ల రాజకీయ పరిస్థితులు ఎప్పుడైనా మారే అవకాశం ఉందన్నారు. అందువల్ల పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సంకీర్ణ భాగస్వాములు, బయట నుంచి మద్దతు ఇచ్చిన పార్టీల సహకారంతో సమీకరించింది. ఈ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వ స్థిరత్వంపై ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తుతోంది.

అయితే స్టాలిన్ వ్యాఖ్యలపై గతంలోనే డీఎంకే స్పష్టీకరణ ఇచ్చింది. ప్రభుత్వం కూల్చివేయాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, ప్రభుత్వ పనితీరుపై రాజకీయ విమర్శల సందర్భంలోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ నాయకత్వం తెలిపింది. మరోవైపు, స్టాలిన్ తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ స్థిరత్వంపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. అయితే టీవీకే నుంచి ఈ వ్యాఖ్యలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది

రాజకీయ సమీకరణాలు ఇలా..
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే 59, ఏఐఏడీఎంకే 47 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు 20 స్థానాలు దక్కించుకున్నాయి. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు టీవీకేకు మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉండగా, తాజాగా వైకో నేతృత్వంలోని ఎండీఎంకే కూడా డీఎంకే కూటమికి గుడ్‌బై చెప్పి అధికార టీవీకేకు మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.