నేలపట్ల చేనేత సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- సహకార పతాకాన్ని ఆవిష్కరించిన పీఐసీ చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్
- ఫారం-1 నోటీసును అందజేసిన ఎన్నికల అధికారి వి. అశోక్ కుమార్
- జూలై 10న పోలింగ్.. చేనేత కార్మికుల్లో పెరిగిన ఉత్కంఠ
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ పరిధిలోని ప్రసిద్ధ “నేలపట్ల హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్” (రిజస్టర్డ్ నెం. 4/TH(W)) నూతన మేనేజింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. సోమవారం సహకార వారోత్సవాల సందర్భంగా సొసైటీ ఆవరణలో పీఐసీ చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సంఘ కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావారణంలో నిర్వహించబడింది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ జి. చంద్రమోహన్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల (Rc. No. 1101/YDR/SCEA/2025) ప్రకారం.. జిల్లా సహకార అధికారి కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ నియమిత ఎన్నికల అధికారి వి. అశోక్ కుమార్ సోమవారం నేలపట్ల సంఘ కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్, నిబంధనలు, బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియపై సంఘ సభ్యులకు కూలంకషంగా వివరించారు. అనంతరం ఎన్నికల అధికారిక నోటీసు (ఫారం-I)ను పీఐసీ చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్‌కు అందజేశారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 ప్రకారం సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అశోక్ కుమార్ స్పష్టం చేశారు.
ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు
జూన్ 29 (సోమవారం): ఎన్నికల అధికారి ద్వారా ఫారం-1 నోటీసు జారీ, జూలై 02 నుండి జూలై 04 నామినేషన్ల స్వీకరణ (ఫారం-2) (3 పనిదినాలు, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు), జూలై 05 (ఆదివారం) నామినేషన్ల పరిశీలన, జూలై 06 (సోమవారం) నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు, జూలై 10 (శుక్రవారం): ఉదయం నుండి పోలింగ్ నిర్వహణ. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, ఫలితాల ప్రకటన తర్వాత 3 రోజుల్లోపు నూతన కమిటీ ఆఫీస్ బేరర్ల (అధ్యక్ష, ఉపాధ్యక్షుల) ఎన్నిక ప్రక్రియ ఉంటుంది.
9 స్థానాలు.. రెండు రంగుల బ్యాలెట్ పత్రాలు
సొసైటీ నూతన మేనేజింగ్ కమిటీలో మొత్తం 9 సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మహిళా కేటగిరీ 2 స్థానాలు, వీరి కొరకు లేత గులాబీ రంగు బ్యాలెట్ పేపర్ ఉపయోగించబడుతుంది. ఓపెన్ కేటగిరీ 7 స్థానాలు, వీరి కొరకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ ఉపయోగించబడుతుంది. ఈ ప్రత్యేక పతాకావిష్కరణ, నోటిఫికేషన్ విడుదల కార్యక్రమంలో పీఐసీ చైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాస్, పీఐసీ కార్యదర్శి కిష్టయ్య, ఎన్నికల అధికారి వి. అశోక్ కుమార్, ప్రముఖులు రవ్వ పండు, గుర్రం శ్రీనివాసులు, పిల్లలమర్రి కిరణ్, ఆంజనేయులు, అవిరేను లక్ష్మణ్, తడక వెంకటేష్‌లతో పాటు సొసైటీ పరిధిలోని చేనేత కార్మికులు, ఓటర్లు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో నేలపట్ల పరిసర ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
