India New Rules | అమల్లోకి రానున్న సరికొత్త నిర్ణయాలు!

India New Rules | అమల్లోకి రానున్న సరికొత్త నిర్ణయాలు!

India New Rules | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రతి నెల మొదటి తేదీతో పాటు పలు ఆర్థిక, వినియోగదారుల సేవలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోవడం సాధారణమే. సామాన్యుడి నెలవారీ ఆర్థిక ప్రణాళికలను మార్చేందుకు మరోసారి ఒకటో తేదీ సిద్ధమైంది. జులై 1, 2026 నుంచి దేశంలోని వినియోగదారుల సేవల్లో, రంగంలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. నిత్యావసర ఇంధన ధరలతో పాటు, ఆటోమొబైల్ సంస్థల ధరల పెంపు నిర్ణయాలు మధ్య తరగతికి కొత్త సవాళ్లను విసరనున్నాయి. మరోవైపు బ్యాంకింగ్, డిజిటల్ సేవల నిబంధనలు కూడా మారుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల నుంచి కార్ల కొనుగోలు వరకు, క్రెడిట్ కార్డుల నుంచి ఆధార్ సేవల వరకు పలు మార్పులు అమల్లోకి రానున్నాయి.

కియా, టాటా కార్లు కొనాలనుకునేవారికి షాక్…

జులై 1 నుంచి కియా ఇండియా తన కార్ల ధరలను గరిష్టంగా 2 శాతం వరకు పెంచనుంది. అలాగే టాటా మోటార్స్ కూడా కొన్ని మోడళ్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాల ధరలు, తయారీ వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు తెలిపాయి. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అదనపు భారం కానుంది.

హెచ్‌డీఎఫ్‌సీ రెగాలియా గోల్డ్ కార్డుకు కొత్త రూల్స్..

హెచ్‌డీఎఫ్‌సీ రెగాలియా గోల్డ్ (HDFC Regalia Gold) క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఎయిర్‌పోర్ట్ లాంజ్ సదుపాయంపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నిర్దిష్ట మొత్తంలో ఖర్చు చేసిన వారికి మాత్రమే ఉచిత లాంజ్ యాక్సెస్ లభించేలా బ్యాంకు మార్పులు చేసింది. దీంతో కార్డుదారులు కొత్త నిబంధనలను ముందుగానే తెలుసుకోవడం అవసరం.

దీని ప్రకారం.. ఒక త్రైమాసికంలో 3 ఉచిత డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ విజిట్స్ పొందాలంటే, వినియోగదారులు అంతకు ముందటి త్రైమాసికంలో తమ కార్డు ద్వారా కనీసం రూ. 60,000 ఖర్చు చేసి ఉండాలి. ఉదాహరణకు, ఒక కార్డుదారు జులై-సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో ఉచిత లాంజ్ సదుపాయాన్ని వాడుకోవాలనుకుంటే, అంతకుముందు క్వార్టర్ అయిన ఏప్రిల్-జూన్ 2026 వ్యవధిలో కనీసం రూ. 60,000 మొత్తాన్ని క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసి ఉండాలి. అప్పుడే ఎయిర్‌పోర్ట్ లాంజ్ వద్ద కార్డును స్వైప్ చేసినప్పుడు ఉచిత ప్రవేశానికి అర్హత లభిస్తుంది. క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరగడంతో విమానాశ్రయాల్లోని లాంజ్‌లలో రద్దీని నియంత్రించడానికి మరియు కేవలం ఉచిత సేవల కోసమే కార్డులు తీసుకుని పెద్దగా వాడకుండా ఉండే వారిని పక్కన పెట్టి, రెగ్యులర్‌గా కార్డును ఉపయోగించే యాక్టివ్ కస్టమర్లకే ఈ ప్రీమియం సేవలను అందించాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్ ఉచితం..

ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి యూఐడీఏఐ ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. నిర్ణీత గడువు వరకు ఈ సేవను ఉచితంగా అందించనుంది. ఆధార్ వివరాలను తాజాగా ఉంచుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. సాధారణంగా ఆధార్‌లో ఈమెయిల్ మార్పులు చేసుకోవడానికి ఇప్పటివరకు రూ. 75 ఫీజు వసూలు చేయగా, జులై 1వ తేదీ నుండి రాబోయే ఆరు నెలల పాటు (డిసెంబర్ 31 వరకు) ఈ రుసుమును పూర్తిగా రద్దు చేశారు.

అయితే ఈ ఉచిత సదుపాయం కేవలం అధికారిక ఆధార్ మొబైల్ యాప్ (mAadhaar app) ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌కు ఈమెయిల్‌ను కూడా అనుసంధానం చేసుకుని డిజిటల్ భద్రతను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చారు. కాబట్టి ఆధార్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

వంటగ్యాస్ ధరల్లో మార్పు..

ప్రతి నెల మొదటి తేదీన ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ముడి చమురు ధరలను బట్టి కొత్త ధరలను ప్రకటన చేస్తాయి. దీంతో గృహ వినియోగ, వాణిజ్య సిలిండర్ల ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇదే రోజు విమాన ఇంధనం (ATF) ధరలను కూడా సవరిస్తారు. దీని ప్రభావం విమాన టికెట్ ధరలపై పడే అవకాశం ఉంది.

ఇతర ఆర్థిక సేవల్లోనూ మార్పులు..

జులై నెల ప్రారంభంతో కొన్ని బ్యాంకింగ్, ఆర్థిక సేవలకు సంబంధించిన నిబంధనలు కూడా మారనున్నాయి. క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు, ఛార్జీలు, ఇతర సేవల్లో మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో వినియోగదారులు తమ బ్యాంకులు, సంబంధిత సంస్థల నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని పరిశీలించడం మంచిది.