జనంలో చైతన్యం

చట్టాల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
ఘంటసాల ఎస్ఐ వేమన చందన
ఘంటసాల, ఆంధ్రప్రభ : చట్టాల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ వేమన చందన తెలిపారు. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు అవనిగడ్డ డిఎస్పీ అభిషేక్, సీఐ ఈశ్వర్ రావుల పర్యవేక్షణలో ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడాలి గ్రామంలో జనచైతన్యం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ చందన మాట్లాడుతూ ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించటం, యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచటం, మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన కల్పించటానికి జన చైతన్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే తక్షణమే సమాచారం అందించాలని సూచించారు. తెలియని వ్యక్తులకు ఓటిపిలు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను వినియోగించుకోవాలన్నారు.
సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, ఫేక్ లింకులు, మోసపూరిత యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
