ప్రజాధనం దుర్వినియోగం చేస్తే..

ప్రజాధనం దుర్వినియోగం చేస్తే..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: మండలంలోని రేలకుంట గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పంచాయతీ తీర్మానం లేకుండానే సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో ఎంపీఓ పసరగొండ రవి ప్రత్యక్షంగా విచారణ చేపట్టారు. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు కొంత మంది సభ్యుల పాత్ర పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనులు పూర్తి కాక ముందే బిల్లులు క్లియర్ చేయడం, విధి విధానాలను పూర్తిగా పక్కన పెట్టడం వంటి గంభీర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనలో లక్షల రూపాయల మేర అక్రమాలు జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం నిజానిజాలు వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీఓ స్పష్టం చేశారు. ఇక గ్రామస్థులు మాత్రం “అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టకూడదు” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధుల వినియోగం పై పారదర్శకత కల్పించాలని, ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
