Crime | డెకాయ్ ఆపరేషన్‌లో ముగ్గురు అరెస్ట్

Crime | డెకాయ్ ఆపరేషన్‌లో ముగ్గురు అరెస్ట్

Crime | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిపై నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్‌లో ఆస్పత్రి డైరెక్టర్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, మహిళా పోలీసును డెకాయ్‌గా పంపించి అక్రమ కార్యకలాపాలపై ఆధారాలు సేకరించారు. గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారిస్తామని ఆస్పత్రి సిబ్బంది హామీ ఇచ్చినట్లు గుర్తించారు. అనంతరం గర్భిణులను తుక్కుగూడలోని ఓ క్లినిక్‌కు పంపుతున్నట్లు విచారణలో తేలింది.

తుక్కుగూడ క్లినిక్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్‌ను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే రిసెప్షనిస్ట్ లోకేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఆస్పత్రి డైరెక్టర్ కొర్ర రాజుతో పాటు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

నిందితులపై గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణను నిరోధించే పీసీపీఎన్‌డీటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గర్భంలోని శిశువు లింగాన్ని వెల్లడించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.