వసతి గృహాల్లో విద్యార్థుల ఇబ్బందులు…

వసతి గృహాల్లో విద్యార్థుల ఇబ్బందులు…

సమయపాలన పాటించని వార్డెన్లు
కొరవడిన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ
పదవ పరీక్షల ముందు హాస్టళ్లలో పర్యవేక్షణ శూన్యం
అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల హెచ్చరిక

అచ్చంపేట, ఆంధ్రప్రభ : నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వాలు లక్షలాధి రూపాయలు వెచ్చించి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్న క్షేత్ర స్థాయిలో అందుకు పూర్తిగా విరుద్దమైన పరిస్థితి నెలకొన్నది. విద్యార్థుల సంక్షేమాన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన లక్షలాధి రూపాయల ప్రభుత్వ వేతనం తీసుకుంటున్న ఉద్యోగులు విద్యార్థుల సంక్షేమం పట్ల మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రజలు, విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అచ్చంపేట నియోజకవర్గ ప్రాంతంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో, గురుకుల, ఆశ్రమ పాఠశాలలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. హాస్టల్ వార్డెన్లు, హెడ్మాస్టర్లు, వసతి గహ సంక్షేమాధికారులు, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని చూసుకోవాల్సిన వార్డెన్లు విధులను పక్కన పెట్టి హాస్టళ్లకు దూరంగా ఉంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నియమాల ప్రకారం వార్డెన్లు ఉదయం 7 గంటల నుంచి విద్యార్థులు పాఠశాలకు వెళ్లే వరకు హాస్టల్‌లో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలి. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల వార్డెన్లు హాస్టళ్లలో కనిపించకపోవడం సాధారణమైందని, కొందరు పట్టణాలకు వెళ్లి కాలక్షేపం చేస్తుండగా, మరికొందరు క్రీడా మైదానాలు, గ్రౌండ్లలో ఆటలు, పాటలతో కాలం గడుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

కొంతమంది వార్డెన్లు పట్టణంలోని ప్రధాన రహదారుల వద్ద, చాయ్ దుకాణాల వద్ద కాలం గడుపుతూ విద్యార్థుల సమస్యలను పూర్తిగా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈనెల 14న పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాస్టళ్లలో పర్యవేక్షణ మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ స్టడీ అవర్స్ సమయంలో విద్యార్థులను పర్యవేక్షించాల్సిన వార్డెన్లు, స్పెషల్ ఆఫీసర్లు మాత్రం కనీసం హాస్టళ్ల వైపు చూడకపోవడం పరిస్థితి దారుణంగా మారిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సరైన మార్గదర్శకత, పర్యవేక్షణ లేకపోవడంతో వారి చదువుపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు చెబుతున్నారు. హాస్టళ్ల పరిస్థితిని పర్యవేక్షించాల్సిన ప్రత్యేక అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విధులు నిర్వర్తించని వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అలాగే హాస్టళ్లపై తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక నిర్లక్ష్యం కొనసాగుతుందా? అన్నది ప్రస్తుతం అచ్చంపేట ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.

అస్తవ్యస్తంగా ప్రభుత్వ వసతి గృహాలు
పరీక్షలు సమీపిస్తున్న వేళ అధికారుల పర్యవేక్షణ కరువు…

అచ్చంపేట డివిజన్ పరిధిలో ప్రభుత్వ వసతి గృహాలు పర్యవేక్షణ కరువు. విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిన వసతి గృహ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు గా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మూడు రోజుల్లో విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ కనీసం ప్రత్యేక ఉపాధ్యాయులు చేత శిక్షణ ఏర్పాటు చేయడం లేదని, వసతి గృహాల్లో లైట్లు ఫ్యాన్లు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు వసతి గృహం దాటి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క వసతి గృహాల్లో కనీసం తలుపులకు గడియలు కూడా లేకుండా వ్యవస్థ నడుస్తున్నది. దీనిపైన జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సాధించాలి.

వార్డెన్లు సమయపాలన పాటించాలి…

వసతిగృహాల్లో విద్యార్థులు ఉన్న సమయంలో కూడా వార్డెన్లు అందుబాటులో ఉండకపోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాల్సిన వార్డెన్లు తమ బాధ్యతలను విస్మరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వసతిగృహాల్లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన తాగునీరు, సరిపడా పడకలు, శుభ్రత వంటి కనీస వసతులు కూడా సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం వెంటనే ఈ సమస్యలపై దృష్టి సారించి వసతిగృహాల్లో సరైన వసతులు కల్పించాలి, వార్డెన్లు తమ విధుల్లో బాధ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఏఐఎసఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.