ఆస్పత్రి ఉంది… వైద్యం లేదు’

ఆస్పత్రి ఉంది… వైద్యం లేదు’

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌పై ప్రజల ఆవేదన
వృద్ధులను మోసుకెళ్లాల్సిన దుస్థితి, కనీస సౌకర్యాల కరువు

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : “అమ్మా… నొప్పి… ఇంక ఎంత దూరం మోస్తావురా నాయనా”
ఎనభై ఏళ్ల కమలమ్మ గొంతులో ఆవేదన. కాళ్లు చచ్చుబడిపోయిన వృద్ధురాలు ఓ యువకుడు ర భుజంపై మోస్తూ సీహెచ్‌సీ మెట్లు దిగుతున్నాడు. ఆస్పత్రి బయట రాంప్ ఉంది. కానీ వీల్‌చైర్ లేదు. లోపల స్ట్రెచర్ ఉంది. కానీ తోసే మనిషి లేడు. ఆటోలో దింపినప్పటి నుంచి గేటు దాకా, గేటు నుంచి ఓపీ రూమ్ దాకా… వృద్ధులను, రోగులను మోయడం బంధువులకు తప్పడం లేదు.ఇది నందికొట్కూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర ప్రతిరోజూ కనిపించే దృశ్యం.

ఆస్పత్రి ముందు ఆటోనే అంబులెన్స్..

పక్క ఊరి నుంచి జ్వరంతో వచ్చిన పేషెంట్లను ఆటోలో కూర్చోబెట్టారు. కాళ్లు వాలిపోయాయి. ఆటో దిగగానే వీల్‌చైర్ కోసం చూశారు. అక్కడ ఉన్న ఒక్క కుర్చీకి చక్రం ఊడిపోయి ఉంది. చేసేదేం లేక భుజంపై వేసుకుని రాంప్ ఎక్కించాడు ఇక్కడికి వస్తే ఇలా ఉంది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ యువకుడు
కాళ్లు లేని వ్యక్తి నేలపై పాకుతూ రాంప్ ఎక్కుతున్నాడు. “సార్, వీల్‌చైర్ అడిగితే ‘అవన్నీ విరిగిపోయాయి’ అన్నారు. ఇంజెక్షన్ కోసం వస్తే అవమానంగా ఉంది” అన్నాడు. ఆస్పత్రి బయట చెప్పులు విప్పాలనే రూల్. దీంతో వీల్‌చైర్, కర్రల వాళ్లు చెప్పులు చేత్తో పట్టుకుని వెళ్లాలి. వర్షం వస్తే రాంప్‌పై జారి పడుతున్నారు అని పట్టణ ప్రజలు తెలుపుతున్నారు

రాత్రైతే దేవుడే దిక్కు..

రాత్రి 9 గంటలకు కాన్పు నొప్పులతో వచ్చిన మహిళను చూసే నర్సు లేదు. డ్యూటీ డాక్టర్ క్వార్టర్స్‌లో ఉన్నాడు. ఫోన్ చేస్తే “కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లండి” అని సమాధానం. చివరకు ఆటోలో 30 కి.మీ. దూరంలోని జిల్లా ఆస్పత్రికి పరుగులు తీసి అక్కడికి వెళ్లే లోపు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. “కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టారు. రాంప్ వేశారు. కానీ వీల్‌చైర్‌ నుండి పేషెంట్లను తీసుకుపోయే ఒక్క అటెండర్‌ను పెట్టలేరా? మా పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటూ మమ్మల్నే పట్టించుకోరా?” అని రోగుల బంధువులు నిలదీస్తున్నారు. “స్వర్ణాంధ్ర అంటే ఇదేనా? కనీసం మందు, మంచినీళ్లు, మనిషి సాయం లేని ఆస్పత్రిలో పేదవాడు ఎలా బతకాలి?” అని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

సిపిఎం నాయకులు ఫకీర్ సాహెబ్.. పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగులు గర్భిణీలు బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కమిటీ సెంటర్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి సరైన వైద్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Leave a Reply