ఎస్ఐఆర్ పనితీరుపై ఆరా తీసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన సమావేశంలో జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతితో పాటు వివిధ పరిపాలనా అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితాల నవీకరణ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేందుకు చేపడుతున్న చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆరా తీశారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బూత్ స్థాయి అధికారుల పనితీరు, ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న చర్యలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వివరించారు.
