ప్రభుత్వ బడికి ఐదుగురు చిన్నారుల అడుగు..

ప్రవేశోత్సవం ఘనంగా

మున్సిపల్ వైస్ చైర్మన్ జేజేలత–జేజే నర్సయ్య చొరవతో ప్రవేశాలు..

ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు అవగాహన

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ పట్టణంలోని ఎస్సీ వాడ (హరిజనవాడ) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మున్సిపల్ వైస్ చైర్మన్ జేజేలత, జేజే నర్సయ్య చొరవతో ఐదుగురు చిన్నారులకు పాఠశాలలో ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పూలమాలలు వేసి, పుస్తకాలు అందజేసి ఆప్యాయంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.