భార్య చేతిలో భర్త దారుణ హత్య

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: అతిగా మద్యం సేవించి తరచూ గొడవలకు దిగుతున్నాడనే ఆగ్రహంతో భార్య భర్తను హత్య చేసిన ఘటన బుధవారం పెద్దపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన గద్దల శ్రీనివాస్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని భార్య గద్దల పుష్పలత ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది.

మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ మరోసారి భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన పుష్పలత కర్ర, తాపీతో శ్రీనివాస్‌పై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రవీణ్ తెలిపారు.