మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం..
అవ్వ తాతల ఆనందమే ప్రభుత్వ ధ్యేయం..
రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బిసి..
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : అవ్వ తాతల కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపి పెద్ద కొడుకు లాగా అందరిని చూసుకుంటున్నాడని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నరు.పట్టణం భానుముక్కల ఎస్సీ కాలనీ ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలు చేశారు. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ చేశారు. స్థానిక ఎస్సీ కాలనీలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి, వారి యోగ – క్షేమాలు అడిగి తెలుసుకుని.. ఇంటి వద్దే అవ్వాతాతలకు పింఛన్లు అందజేశారు.
పింఛన్ల పంపిణీ సందర్భంగా స్థానికంగా ప్రజా సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై నేరుగా ప్రజల అభిప్రాయాలను అడిగి తెసుకున్నరు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో గత రెండేళ్లలో రూ 68,598 కోట్లు పెన్షన్ రూపంలో లబ్ధిదారులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న, ప్రజల ఆకాంక్షల మేరకు సూపర్ సిక్స్ ను సూపర్ సక్సెస్ చేసామన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 3 వేల నుంచి 4 వేలకు పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ప్రతి నెల ఒకటవ తేదీనే క్రమం తప్పకుండా లబ్ధిదారులకు ఫించన్లు అందజేస్తోందన్న ప్రభుత్వం తమదే అన్నారు. జూలై నెలలో దాదాపుగా 62.19 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ. 2,711 కోట్లు పెన్షన్లు అందిస్తున్నామన్నారు.
అవ్వాతాతల సౌకర్యార్థం ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.స్పౌజ్ పెన్షన్లు సైతం కేవలం ఒక నెల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వంలో అందిస్తున్నామన్నారు. జులై నెల నుంచి కొత్తగా 7792 మందికి స్పౌజ్ పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. స్థానికంగా తమకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రజలకోరారు.స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కాంపౌండ్ వాల్ నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకురాగా, సమస్యలు పరిష్కరించి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చరు.
