సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ

సైబర్ నేరాలపై అప్రమత్తతే రక్షణ

నకిలీ యాప్స్‌, డిజిటల్ అరెస్ట్‌లపై జాగ్రత్తలు తప్పనిసరి
సైబర్ మోసాలపై ప్రజలకు ఎస్పీ సునీల్ షొరాణ్ హెచ్చరికలు

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సాంకేతికతను అడ్డంగా ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ ఏపీకే ఫైల్స్‌, అనధికార లోన్ యాప్స్‌, డిజిటల్ అరెస్ట్‌లు, పెట్టుబడి మోసాల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వాట్సాప్‌, టెలిగ్రామ్‌, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఆర్‌టీఓ ఈ-చలానా, ఎస్‌బీఐ రివార్డ్స్‌, యోనో అప్‌డేట్‌, వెడ్డింగ్ ఇన్విటేషన్ పేర్లతో లింకులు పంపిస్తున్నారని తెలిపారు. ఆ లింకుల ద్వారా డౌన్‌లోడ్ అయ్యే ఏపీకే ఫైల్స్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయితే బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. గూగుల్ ప్లే స్టోర్‌, ఆపిల్ యాప్ స్టోర్ మినహా ఇతర వనరుల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు.

తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని ఎస్పీ హెచ్చరించారు. ఆర్‌బీఐ గుర్తింపు లేని లోన్ యాప్స్ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌, ఫోటోలు దొంగిలించి, తర్వాత నకిలీ చిత్రాలు సృష్టించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలను మాత్రమే సంప్రదించాలని సూచించారు.

డిజిటల్ అరెస్ట్ పేరిట సీబీఐ, ఈడీ, పోలీస్‌, కొరియర్ సంస్థల అధికారులమంటూ వీడియో కాల్స్ చేసి భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని చెప్పారు. చట్టంలో ఎక్కడా ‘డిజిటల్ అరెస్ట్’ అనే విధానం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 112 లేదా 100 నంబర్లకు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.

పార్ట్‌టైమ్ జాబ్స్‌, యూట్యూబ్ వీడియోలకు లైకులు కొడితే డబ్బులు వస్తాయని, క్రిప్టో పెట్టుబడుల పేరుతో టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా లక్షలు దోచుకుంటున్నారని తెలిపారు. బ్యాంక్ అధికారులు, పోలీసులు ఎప్పుడూ ఓటీపీలు, ఏటీఎం పిన్‌, పాస్‌వర్డ్‌లు అడగరని గుర్తుంచుకోవాలని అన్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ ఎత్తవద్దని, ఏ లింక్ క్లిక్ చేసే ముందు నిజస్వరూపాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు.

సైబర్ మోసానికి గురైతే తొలి 24 గంటల ‘గోల్డెన్ అవర్’లోపు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్ లేదా జిల్లా సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా సంప్రదించవచ్చన్నారు.

Leave a Reply