భూమి భగ్గుమంటోంది

భూమి భగ్గుమంటోంది

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సూర్యోదయం నుంచే భానుడు భగ్గుమంటూ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాడు. సూర్యుడి తాపానికి తట్టుకోలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం గుమ్మం దాటాలంటేనే జంకుతున్నారు. ప్రస్తుతం 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం రోజులు పరిస్థితి మరింత తీవ్రమవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉందని తెలిపింది. ఉదయం 9 గంటలకే రోడ్లపై రాకపోకలు తగ్గిపోతున్నాయి. ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్లు వెలవెలబోతున్నాయి.

మరో వారం ఇదే పరిస్థితి
ఉదయం 11 దాటిందంటే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జనం బయటకు రావడానికి భయపడుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక వ్యాపారులు కూడా దుకాణాలు మూసేస్తున్నారు. రాష్ట్రంలోని నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నల్గొండ, అదిలాబాద్, భద్రాద్రి, కొమురం భీం జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదిలాబాద్‌లో అత్యధికంగా 44.5 డిగ్రీలు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో 42 డిగ్రీలు నమోదయ్యాయి. అదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా పలు సూచనలు జారీ చేస్తున్నారు. సూర్య తాపాన్ని తగ్గించేందుకు శీతల పానీయాలు తీసుకోవాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

నిర్మానుష్యంగా రోడ్లు
భానుడి ప్రభావంతో పలు జిల్లాల్లో రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా ఆర్టీసీ బస్సులు కూడా ఖాళీగా నడుస్తున్నాయి.

ఆసుపత్రులకు వడదెబ్బ బాధితుల తాకిడి
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వడదెబ్బ బాధితుల సంఖ్య పెరుగుతోంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో అనేక మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కూలీలు, రైతులు కూడా ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురవుతున్నారు. వైద్యులు బాధితులకు చికిత్స అందిస్తూ, అవసరమైతే జిల్లా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే వడదెబ్బ కారణంగా పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఇళ్లలో కూడా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

శీతల పానీయాలకు పెరిగిన డిమాండ్
వేసవి వేడిని తట్టుకునేందుకు ప్రజలు మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం, పండ్ల రసాల వంటి శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. అలాగే వైన్ షాపుల్లో బీర్ల విక్రయాలు కూడా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వేసవి కాలంలో సాధారణం కంటే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి.

Leave a Reply