శ్యామలాంబకు ఆషాఢ సారె
కైకలూరు, ఆంధ్రప్రభ: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు గ్రామంలోని శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారిని సోమవారం మహిళా భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కైకలూరు కాలవగట్టు ప్రాంతానికి చెందిన మహిళలతో పాటు చాయలపాడు గ్రామ మహిళా భక్తులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక అర్చనలు నిర్వహించగా, భక్తులకు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ వాసు మాట్లాడుతూ.. మహిళా భక్తులను ఆలయానికి ఆహ్వానించి ఆషాఢ మాస ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
