మెరుగైన వైద్యం కోసం రూ.12.13 లక్షల ఎల్ఓసీలు అందజేత

ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో బాధిత కుటుంబాలకు ఊరట

భవానిపురం, ఆంధ్రప్రభ : మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ఓసీలను ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ఆయన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి సోమవారం ఎన్డీయే కార్యాలయంలో బాధిత కుటుంబాలకు అందజేశారు.

53వ డివిజన్‌కు చెందిన పి. కనకరావు (44) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో బీజేపీ నాయకుడు పోతిన అవినాష్ వైద్యసాయం కోసం ఎన్డీయే కార్యాలయంలో దరఖాస్తు చేయగా, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.8 లక్షల ఎల్ఓసీని కుటుంబ సభ్యులకు అందజేశారు.

అలాగే 39వ డివిజన్‌కు చెందిన డి. లక్ష్మణ్ (21) అనారోగ్యంతో బాధపడుతూ వైద్యసాయం కోసం దరఖాస్తు చేసుకోగా, ఆయనకు మంజూరైన రూ.4.13 లక్షల ఎల్ఓసీని అందజేశారు.

త్వరితగతిన స్పందించి ఎల్ఓసీలు మంజూరు చేయించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్‌కుమార్, ఎన్డీయే కూటమి నాయకులు పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, అడ్డూరి భాస్కరరావు, పులిచేరి రమేష్, విజయలక్ష్మి, సాయి శరత్, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.