రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభం
రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ ప్రారంభం
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: విజయ భాస్కర్
ఉరవకొండ, ఆంధ్రప్రభ: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్ పేర్కొన్నారు. రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు.
ఉరవకొండ పట్టణంలోని వ్యవసాయ డివిజన్ కార్యాలయం వద్ద సోమవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవినేని పురుషోత్తం, బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ, ఉరవకొండ వ్యవసాయ డివిజన్ పరిధిలోని రైతు సేవా కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాల పంపిణీ కొనసాగుతున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వేలిముద్రలు నమోదు చేసి, నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన రైతులకు విత్తనాలను అందజేస్తున్నట్లు తెలిపారు. కే-6, టీసీజీఎస్-1694 రకాల వేరుశనగ విత్తనాలకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందని చెప్పారు.
ఒక్క సంచి (30 కిలోలు) అర్థ ఎకరాకు, రెండు సంచులు (60 కిలోలు) ఒక ఎకరానికి సరిపోతాయని వివరించారు. కే-6 రకం 1,800 క్వింటాళ్లు, టీసీజీఎస్-1694 రకం 100 క్వింటాళ్లు, కదిరి లేపాక్షి రకం 100 క్వింటాళ్లు మంజూరైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీనరసింహస్వామి ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు, మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, మాజీ సర్పంచ్ ఓబులేసు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ కండక్టర్ తిమ్మప్ప, సూరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
