ధర్మవరంలో రైతు కిడ్నాప్ కలకలం

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కలకలం

భూ వివాదం నేపథ్యంలో ఘటన -కారులోనే విచక్షణారహితంగా దాడి -20 నిమిషాల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో శుక్రవారం రైతు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన నారాయణ అనే రైతును భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థులు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.

సమాచారం మేరకు.. భూ తగాదాకు సంబంధించిన వ్యవహారంపై నారాయణ ధర్మవరం ఆర్డీవో కార్యాలయానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని, అందరూ చూస్తుండగానే నారాయణను బలవంతంగా ఇన్నోవా వాహనంలోకి ఎక్కించారు. అనంతరం కారులోనే అతనిపై విచక్షణారహితంగా దాడి చేస్తూ అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీఐ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా సుమారు 20 నిమిషాల్లోనే ఇన్నోవా వాహనాన్ని గుర్తించి సీజ్ చేశారు. అలాగే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో పాల్గొన్న ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply