అత్వెల్లిలో తాగునీటి సమస్య పరిష్కరించాలి..
అత్వెల్లిలో తాగునీటి సమస్య పరిష్కరించాలి..
- డిప్యూటీ కమిషనర్‌కు మాజీ కౌన్సిలర్ల వినతి
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 298వ డివిజన్ అత్వెల్లి ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.
అత్వెల్లి ప్రాంతంలోని 1, 2, 3 వార్డుల్లో గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మాజీ కౌన్సిలర్లు శ్రావణ్ కుమార్ గుప్తా, జాకట దేవరాజ్, నారెడ్డి రవీందర్ రెడ్డిలు స్పందించి మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ జోన్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్‌ను కలిసి రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాత అత్వెల్లి పట్టణంలోని రాఘవేంద్ర నగర్ కాలనీతో పాటు సమీపంలోని పలు సబ్ కాలనీల్లో గత కొద్ది రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాగునీటి కోసం ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. తాగునీరు ప్రజల ప్రాథమిక అవసరమని, అత్వెల్లి ప్రాంతంలోని 1, 2, 3 వార్డుల్లో వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించి క్రమబద్ధంగా అందేలా చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్లు జాకట దేవరాజ్, శ్రావణ్ కుమార్ గుప్తా డిప్యూటీ కమిషనర్‌ను కోరారు.
వారి వినతిపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ సుధాంష్ సమస్యను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నారెడ్డి కొండాల్ రెడ్డి, స్థానిక కాలనీలకు చెందిన పలువురు నివాసితులు, నాయకులు పాల్గొన్నారు.
