కమిషనర్ ను సన్మానించిన సీఐటీయు నాయకులు..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపల్ కార్యాలయానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ పవన్‌ను సీఐటీయూ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం మున్సిపల్ కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

సీఐటీయూ పరకాల అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు అతి తక్కువ వేతనాలతో పనిచేసిన 20 మంది కార్మికులను 60 ఏళ్లు పూర్తయ్యాయనే కారణంతో విధుల నుంచి తొలగించారని తెలిపారు. వారికి న్యాయం చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉపాధి కల్పించాలని కమిషనర్‌ను కోరారు.

అదేవిధంగా ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆ హామీని అమలు చేయలేదని ఆరోపించారు. రాజస్థాన్, ఒడిశా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలపై అనుకూల తీర్పు ఇచ్చిందని పేర్కొంటూ, తెలంగాణలో కూడా మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేసి నెలకు రూ.26 వేల వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు తమ ఆందోళన కార్యక్రమాలను ప్రకటించారు. జూన్ 18, 19 తేదీలలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపడతామని, జూన్ 22న విధులు బహిష్కరించి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే జూన్ 29, 30 తేదీలలో ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాల ముట్టడికి పిలుపునిచ్చారు.

మున్సిపల్ కార్మికుల ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు తలారి ఉప్పలయ్య, భయ్యా కృష్ణంరాజు, మున్సిపల్ కార్మిక నాయకులు పసుల సారయ్య, బొచ్చు ఐలయ్య, చెరుకు నాగరాజు, కోగిల సుమన్, బొచ్చు సురేష్, బుస రవి, ఒంటేరు సారయ్య, ముఠా కొమ్ముల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *