డా. ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం..

  • తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

( విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ ) : క్షిపణి రంగంలో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సేవలు మరువలేనివని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కలాం వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో ఆయన స్థానిక నాయకులతో కలిసి కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, భారతదేశాన్ని క్షిపణి సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు. దేశ రక్షణ, శాస్త్ర–సాంకేతిక రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ప్రజల ప్రేమతో “మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా గౌరవం పొందిన కలాం గారు, భారత విజ్ఞాన ప్రస్థానాన్ని కొత్త శిఖరాలకు చేర్చారని పేర్కొన్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ సోమరాజు గారితో కలిసి “కలాం–రాజు స్టెంట్” రూపకల్పనలో కీలక పాత్ర పోషించడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనమని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాల్లోనూ ఆయన అందించిన సూచనలు విశేషమైనవని గుర్తు చేశారు.

సామాన్య కుటుంబంలో జన్మించి దేశ అత్యున్నత పదవైన భారత రాష్ట్రపతిగా ఎదిగిన కలాం గారి జీవితం ప్రతి యువకుడికి ఆదర్శమని.. విదేశాల నుంచి ఎన్నో ఆకర్షణీయమైన అవకాశాలు వచ్చినప్పటికీ, తన ప్రతిభను దేశానికే అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా మెలిగే కలాం గారు, “కలలు కనండి… ఆ కలలను నిజం చేసుకునే వరకు ఆగొద్దు” అనే సందేశంతో కోట్లాది మంది యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని పేర్కొన్నారు. దేశాభివృద్ధి, విజ్ఞాన శాస్త్రం, విద్య, యువశక్తిపై ఆయన వేసిన చెరగని ముద్ర ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశభక్తి, విలువలు, సేవా తత్వం, అంకితభావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను సాకారం చేసే దిశగా యువత ముందుకు సాగాలని ఉమా పిలుపునిచ్చారు.