ఖరీఫ్‌కు విత్తనాల కొరత లేదు..

బాపట్ల జిల్లాలో సమృద్ధిగా నిల్వలు..
సగానికి పైగా పంపిణీ పూర్తి
విత్తనాలు అందక పంటలు వేయలేదన్న ఫిర్యాదులు లేవు..
రైతులకు సకాలంలో సరఫరా చేస్తున్నాం: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి. లక్ష్మి


బాపట్ల, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సాగు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో బాపట్ల జిల్లాలో విత్తనాల కొరత లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మి స్పష్టం చేశారు. ప్రభుత్వం ద్వారా జిల్లాకు అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచడంతో రైతులకు సకాలంలో పంపిణీ జరుగుతోందన్నారు. జిల్లాలో విత్తనాల సరఫరా, పంపిణీలో ఎలాంటి ఆటంకాలు లేవని, విత్తనాలు అందక పంటలు వేయలేదంటూ ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదని తెలిపారు.

జిల్లాలో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ రకాల పంటలకు సంబంధించిన విత్తనాలను ప్రభుత్వం ముందస్తుగా పంపించింది. ఇప్పటివరకు జిల్లాకు ప్రత్తి 6.3 క్వింటాళ్లు, మిరప 4.72 క్వింటాళ్లు, వరి 17,989 క్వింటాళ్లు, కంది 32 క్వింటాళ్లు, మినుము 45 క్వింటాళ్లు, పెసర 10 క్వింటాళ్లు, జీలుగ 882 క్వింటాళ్లు, జనుము 630 క్వింటాళ్లు, పిల్లిపెసర 740 క్వింటాళ్ల విత్తనాలు చేరినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.

ఈ నిల్వల్లో ఇప్పటివరకు ప్రత్తి 3.1 క్వింటాళ్లు, మిరప 1.59 క్వింటాళ్లు, వరి 9,750 క్వింటాళ్లు, కంది 12 క్వింటాళ్లు, మినుము 18 క్వింటాళ్లు, పెసర 3 క్వింటాళ్లు, జీలుగ 874 క్వింటాళ్లు, జనుము 600 క్వింటాళ్లు, పిల్లిపెసర 733 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. వరి, జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాల పంపిణీ అధికంగా పూర్తయిందని అధికారులు తెలిపారు.

గోదాముల్లో తగిన నిల్వలు…

ప్రస్తుతం ప్రభుత్వ గోదాముల్లో వరి 1,382 క్వింటాళ్లు, జీలుగ 8 క్వింటాళ్లు, జనుము 30 క్వింటాళ్లు, పిల్లిపెసర 7 క్వింటాళ్ల విత్తనాలు నిల్వలో ఉన్నాయి. రైతుల అవసరాలను బట్టి ఈ నిల్వలను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మి తెలిపారు. అవసరమైతే అదనపు విత్తనాలను కూడా ప్రభుత్వం నుంచి తెప్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రైవేట్ విత్తనాలకూ రైతుల మొగ్గు…

జిల్లాలో సుమారు 69 శాతం మంది రైతులు ప్రైవేట్ సంస్థల విత్తనాలను కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం సరఫరా చేస్తున్న ధ్రువీకరించిన విత్తనాలకు కూడా మంచి ఆదరణ ఉందని అధికారులు పేర్కొన్నారు. రైతులు తమ ప్రాంతానికి అనువైన, ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే వినియోగించాలని సూచించారు.

ఇబ్బందులు లేవు.. ఫిర్యాదులు కూడా లేవు…

జిల్లాలో విత్తనాల పంపిణీలో ఎక్కడా కొరత లేదని, రైతులకు సకాలంలో విత్తనాలు అందుతున్నాయని లక్ష్మి తెలిపారు. విత్తనాలు అందక పంటలు వేయలేకపోయామని ఇప్పటివరకు ఏ రైతు నుంచి కూడా ఫిర్యాదు అందలేదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు.

రైతులకు సూచనలు…

వర్షాల పరిస్థితిని బట్టి పంటల ఎంపిక చేసుకోవాలని, ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలని, విత్తనాల అవసరమైతే సమీప రైతు సేవా కేంద్రాలు లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మి సూచించారు. ప్రభుత్వం రైతులకు అవసరమైన అన్ని విత్తనాలను అందుబాటులో ఉంచిందని, ఖరీఫ్ సాగు విజయవంతం కావడానికి శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని ఆమె తెలిపారు.