ప్రభుత్వ స్కూల్ పేరెంట్స్‌కు అవకాశం ఇవ్వాలి..

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రారంభించనున్న ప్రీ-ప్రైమరీ తరగతుల కోసం నియమించనున్న ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకే కేటాయించాలని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు రాయిశెట్టి మానస డిమాండ్ చేశారు.

ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాల వారీగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిందన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో 76 పాఠశాలలకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను విద్యాశాఖ అధికారులు చేపడుతున్నారని తెలిపారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరారు. విద్యాబోధనపై అవగాహన, అనుభవం కలిగిన వారికి ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, పిల్లల సంరక్షణలో నైపుణ్యం ఉన్న మహిళలకు ఆయా పోస్టులు కేటాయించాలని సూచించారు.

స్థానిక సంబంధం లేని వారు లేదా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే వారికి ఈ నియామకాల్లో అవకాశం కల్పించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై జిల్లా, మండల స్థాయి అధికారులు సమాలోచనలు జరిపి, ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆసక్తి, మక్కువ పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

ఈ నియామకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై మరింత విశ్వాసం పెరుగుతుందని మానస అభిప్రాయపడ్డారు.