స్వచ్ఛతే గ్రామాభివృద్ధికి పునాది..
స్వచ్ఛతే గ్రామాభివృద్ధికి పునాది..
- చెత్తను వేరు చేయండి.. ప్రకృతిని కాపాడండి
- గొల్లబుద్ధారంలో అవగాహన కార్యక్రమం
- పాల్గొన్న గ్రామ సర్పంచ్ కిరణ్
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించాలంటే చెత్తను మూలం వద్దనే వేరు చేయడం అత్యంత అవసరమని గొల్లబుద్ధారం గ్రామ సర్పంచ్ సుంకరి కిరణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వచ్ఛ గ్రామం–సురక్షిత్ జలవాయూ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను విడివిడిగా సేకరించడం వల్ల గ్రామంలో చెత్త సమస్య తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు.
ప్రతి ఇంట్లో చెత్తను వర్గీకరించి నిర్ణీత డస్ట్‌బిన్‌లలో వేయాలని సూచించారు. ఆకుపచ్చ, నీలం, నలుపు, ఎరుపు రంగుల చెత్త డబ్బాల వినియోగం, వాటి అవసరాన్ని గ్రామస్తులకు వివరించారు. అనంతరం గ్రామ ప్రజలతో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. తమ ఇళ్లు, దుకాణాలు, ఇతర ప్రదేశాల నుంచి వచ్చే చెత్తను వేర్వేరుగా సేకరించి సరైన విధంగా నిర్వహిస్తామని గ్రామస్తులు హామీ ఇచ్చారు. గ్రామంలో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యమే కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.
