సింగరేణి కార్మికుల పిల్లలకు ఉచిత సమ్మర్ క్యాంప్

సింగరేణి కార్మికుల పిల్లలకు ఉచిత సమ్మర్ క్యాంప్
- భూపాలపల్లిలో ఏప్రిల్ 28 నుంచి క్రీడా శిక్షణ శిబిరం
- బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌తో పాటు పలు క్రీడల్లో శిక్షణ
- ఏరియా అధికార ప్రతినిధి శ్యామసుందర్ వెల్లడి
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి కార్మికుల పిల్లలకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని నిర్వహించ నున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూపాలపల్లి ఏరియా అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఏరియా అధికార ప్రతినిధి, పర్సనల్ మేనేజర్ శ్యాం సుందర్ వెల్లడించారు. 2026-27 సమ్మర్ క్యాంప్‌లో భాగంగా 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఈ శిబిరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 28, మంగళవారం నుంచి భూపాలపల్లి కృష్ణ కాలనీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుందని చెప్పారు.
ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలాగే సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్ వంటి క్రీడాంశాల్లో నైపుణ్యం కలిగిన శిక్షకుల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రతి క్రీడలో సుమారు 20 నుంచి 25 మంది వరకు పాల్గొనేలా 25 రోజులపాటు శిక్షణ కొనసాగుతుందని వివరించారు.
ఆసక్తి గల ఉద్యోగులు తమ పిల్లల పేర్లను ఏప్రిల్ 28 సాయంత్రం 5 గంటలలోపు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలోని సిఈఆర్ క్లబ్‌లో స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్‌ను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. అదే రోజు సాయంత్రం నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని అధికారులు కోరారు.
