విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు
అధికారులకు కీలక ఆదేశాలు
కడెం, ఆంధ్రప్రభ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ నిర్మల్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ) సుభాష్ బుధవారం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి, విద్యుత్ సరఫరా వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ప్రాజెక్టు వద్ద వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ఎస్ఈ సుభాష్, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వరదల సమయంలో విద్యుత్ వ్యవస్థ సజావుగా పనిచేసేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, నియంత్రణ వ్యవస్థల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వరద పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేలా విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన పరికరాలు, సాంకేతిక సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా కడెం ఎస్ఐ సాయికిరణ్, విద్యుత్ శాఖ కడెం ఏఈ రాంసింగ్, ప్రాజెక్టు అధికారులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఎస్ఈకి ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులు, విద్యుత్ వ్యవస్థ పనితీరు, తీసుకుంటున్న భద్రతా చర్యలను వివరించారు.
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో కడెం ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
