గంగిరెద్దుతో పాటు గూగుల్ పే..

మారుతున్న కాలానికి అద్దం

సంప్రదాయ వృత్తిలోనూ డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం

వికారాబాద్, ఆంధ్రప్రభ : కాలానుగుణంగా సాంకేతికత గ్రామీణ ప్రాంతాలకు చేరుతుండగా, సంప్రదాయ వృత్తులు నిర్వహించే కళాకారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు.

కోటపల్లి మండలంలోని కోటపల్లి గ్రామంలో సోమవారం గంగిరెద్దుతో సంప్రదాయ వేషధారణలో ఇంటింటికీ తిరుగుతూ కానుకలు కోరుతున్న ఓ కళాకారుడు, నగదు లేని వారి నుంచి గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా కూడా చెల్లింపులు స్వీకరించడం స్థానికులను ఆకట్టుకుంది.

గంగిరెద్దును అలంకరించి ఇంటి వద్దకు చేరుకున్న కళాకారుడు, నగదు లేకపోతే తన వద్ద ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్‌గా చెల్లించాలని సూచించడం విశేషంగా నిలిచింది. గతంలో గంగిరెద్దుల కళాకారులు ధాన్యం, నగదు రూపంలో కానుకలు స్వీకరించేవారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ డిజిటల్ చెల్లింపులను కూడా అందుబాటులోకి తీసుకురావడం సాంకేతికత గ్రామీణ జీవనశైలిలో ఎంతగా భాగమైందో చూపిస్తోంది.

సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న ఈ దృశ్యం గ్రామస్థులను ఆకర్షించింది. “గంగిరెద్దుతో పాటు గూగుల్ పే కూడా” అంటూ పలువురు ఆసక్తిగా చర్చించుకున్నారు.