Murder in Golconda | బావను హతమార్చిన బావమరిది

Murder in Golconda | బావను హతమార్చిన బావమరిది

Murder in Golconda | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. అక్కను తరచూ వేధిస్తున్నాడనే ఆగ్రహంతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి బావను కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటన గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం, పాతబస్తీకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చాంది మసూద్ గోల్కొండలోని పతేదర్వాజా ప్రాంతానికి చెందిన రుక్సానాను వివాహం చేసుకున్నాడు. అయితే భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం. భర్త వేధింపులు భరించలేక రుక్సానా ఇటీవల పుట్టింటికి వెళ్లినట్లు తెలిసింది.

ఈ క్రమంలో రుక్సానాతో మరోసారి గొడవపడేందుకు పుట్టింటికి వచ్చిన మసూద్‌తో ఆమె సోదరుడు సోయల్ వాగ్వాదానికి దిగాడు. తన అక్కను తరచూ వేధిస్తున్నాడనే ఆగ్రహంతో సోయల్ రెచ్చిపోయినట్లు సమాచారం.

అనంతరం సోయల్ తన స్నేహితులు జాబేర్, అప్పుతో కలిసి చాంది మసూద్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మసూద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.