నిందితుడిపై 40 కేసులు
కరీంనగర్, ఆంధ్రప్రభ : తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం మెటపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ అలియాస్ రవి అలియాస్ విజయ్(28) అను అతను నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాలో దొంగతనాలకు పాల్పడ్డాడు. వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇప్పటి వరకు 40కేసులు నమోదు కాగా పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు.
మెటపల్లి సబ్ డివిజన్ పరిధిలో…
గత కొంతకాలంగా మెటపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో తాళంవేసిన ఇళ్లలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో మల్లాపూర్ ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం ముత్యంపేట నిజాం చెక్కర ఫ్యాక్టరీ సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా మోటార్ సైకిల్ పై వస్తున్న అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితుడిని అరెస్టు చేసి రూ.11లక్షల విలువ గల 103గ్రాముల బంగారం 125.3 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. దొంగను చాకచక్యంగా పట్టుకొని సొత్తును రికవరీ చేసిన మల్లాపూర్ ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రాములు అభినందించారు.