ట్రంప్ కి మెలోని స్ట్రాంగ్ పంచ్ !!

  • ఇటలీ ఎవరినీ వేడుకోదు
  • జీ7 సదస్సు వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని ఘాటు స్పందన
  • మిత్ర దేశాల నాయకుల పట్ల గౌరవం చూపాలని ట్రంప్‌కు సూచన

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: అత్యంత సన్నిహిత రాజకీయ భాగస్వాములుగా భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయి. జీ7 సదస్సులో తనతో ఫొటో దిగేందుకు మెలోని బతిమాలుకున్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇటలీ ప్రధాని తీవ్రంగా స్పందించారు. ఇటాలియన్ టెలివిజన్ ఛానల్ ‘లా7’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “మెలోని నాతో ఫొటో దిగాలని చాలా కోరుకుంది. ఆమె కోసం జాలిపడి ఫొటోకు అంగీకరించాను” అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, “ఆమెతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు” అని కూడా అన్నారు.

ఇటలీ ఎవరినీ వేడుకోదు..

దీనిపై స్పందించిన మెలోని.. ట్రంప్ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. “డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం. అమెరికా అధ్యక్షుడు తన మిత్ర దేశాల నాయకుల పట్ల ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది మొదటిసారి కూడా కాదు” అని విమర్శించారు. పాశ్చాత్య దేశాల ప్రత్యర్థుల పట్ల ట్రంప్ మెత్తటి వైఖరి అవలంబిస్తూనే, మిత్ర దేశాల నేతలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిరాశ కలిగిస్తోందని మెలోని అన్నారు. “పశ్చిమ దేశాల శత్రువుల పట్ల చూపే మర్యాదను మిత్ర దేశాల నాయకుల పట్ల కూడా చూపాలి” అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు నేరుగా కౌంటర్ ఇస్తూ మెలోని.. “ఒక విషయం ఆయన గుర్తుంచుకోవాలి. నేను గానీ.. ఇటలీ గానీ ఎప్పుడూ ఎవరినీ వేడుకోము” అంటూ ఘాటుగా స్పందించారు. ఈ వ్యాఖ్య ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అమెరికా పర్యటన రద్దు చేసిన ఇటలీ విదేశాంగ మంత్రి

ఈ వివాదం మరింత ముదరగా, ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ జూన్ 21-22 తేదీల్లో జరగాల్సిన అమెరికా పర్యటనను రద్దు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు మెలోనిని మాత్రమే కాకుండా ఇటలీ దేశాన్నే అవమానించినట్లుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్, మెలోని మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన వీడియోలు బయటకు వచ్చినప్పటికీ.. తాజా వ్యాఖ్యలతో ఇరువురు నేతల మధ్య ఉన్న సంబంధాలు మరింత దెబ్బతిన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.