Tesla | తాజా ప్రమాదం రేపుతున్న సంచలన ప్రశ్నలు!
Tesla | తాజా ప్రమాదం రేపుతున్న సంచలన ప్రశ్నలు!
Tesla | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఏఐ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆటోపైలట్, సెల్ఫ్ డ్రైవింగ్‌తో ప్రపంచంలో రవాణా వ్యవస్థ టెక్నాలజీలో దూసుకుపోతోంది. ఈ తరుణంలో అమెరికాలో జరిగిన ఓ విషాద ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆలోచనలో పడేలా చేసింది. అత్యధునిక టెక్నాలజీతో నడిచే టెస్లా ఆటోమేటిక్ కారు.. అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకుపోవడంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన టెస్లా కార్ల కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదం తరువాత డ్రైవర్ చెప్పిన మాటలు ఇప్పుడు మరింత కలకలం రేపుతున్నాయి. డ్రైవింగ్ సమయంలో కారు ఆటోపైలట్ మోడ్‌లో ఉందని చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ ప్రమాదం మానవ తప్పిదమా..? లేక టెస్లా సాఫ్ట్వేర్ లోపమా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇదేం మొదటి ప్రమాదం కాదు..
టెస్లా కార్లు వినియోగానికి చాలా సురక్షితమని కంపెనీ యాజమాన్యం చెబుతున్నా.. ప్రమాద గణాంకాలు మాత్రం మరోరకంగా ఉన్నాయి. 2021 నుంచి ఇప్పటి వరకు టెస్లా ఆటోపైలట్, సెల్ఫ్ డ్రైవింగ్ ద్వారా దాదాపుగా 3,866 ప్రమాదాలు నమోదయ్యాయి. అనేక కేసుల్లో ఇప్పటికీ పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు.
మనిషే తప్పు చేస్తుంటే మిషన్ చేయదా?
డ్రైవింగ్ చేసేటప్పుడు మనిషే క్షణకాలంలో తప్పు చేయడం వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు.. ప్రమాదాన్ని ముందే గ్రహించి బయటపడిన సందర్భాలు అనేకం. అలాంటిది ఓ మిషన్, వచ్చే ప్రమాదాన్ని వెంటనే నివారించగలదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. కొన్ని సెకన్లలో తీసుకునే నిర్ణయాల్లో మానవ మెదడును మిషన్లు భర్తీ చేయలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రమాదం కారులో కాదు.. నమ్మకంలో..
ప్రస్తుతం ఉన్న ఆటోపైలట్ కార్లు డ్రైవర్‌కు సహాయంగా మాత్రమే ఉండగలవు.. కానీ స్టీరింగ్, క్లచ్, బ్రేక్ పట్టుకుని రోడ్డును చూస్తూ నడిపేంతగా, మనిషిలా నిర్ణయాలు తీసుకునేంతగా మారలేదు. ఆటోపైలట్ కార్లు అనగానే మనం అనుకునేది కారు దానంతట అదే నడుస్తుందిలే అని.. దానిపైన నమ్మకంతో మనం రోడ్లపై అజాగ్రత్తగా ఉండటం ప్రమాదాలకు దారితీస్తోంది.
మన భవిష్యత్తు మన చేతిలో..
ఏఐ టెక్నాలజీ రావడంతో మనిషి పూర్తిగా దాని మీద ఆధారపడటం.. ఇది ఒక వైపు పనులను సులభతరం చేస్తున్నా.. మరోవైపు మనల్ని ప్రమాదాల బారిన పడేస్తోంది. ప్రమాదం అనేది చెప్పి రాదు.. అలాంటి ప్రమాదాలను మనిషి మాత్రమే సమయస్ఫూర్తితో జయించగలడు. ఏఐ ఎంత తెలివైందైనా సరే దాని సహాయం తీసుకోవడంలో తప్పులేదు.. కానీ దాని మీదే పూర్తిగా ఆధారపడటం అనేది మానవాళికి ప్రమాదకరమే.
