మెగా రక్తదాన శిబిరం..

మెగా రక్తదాన శిబిరం..

రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహణ
స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 42 మంది రైల్వే ఉద్యోగులు
‘ఒక చుక్క మానవత్వం.. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి’ సందేశం
మానవతా సేవలో రైల్వే ఉద్యోగుల అంకితభావానికి నిదర్శనం

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటిటీసీ)లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, డివిజనల్ రైల్వే ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతో పాటు మరింత మంది స్వచ్ఛంద రక్తదాతలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టారు. ఈ సందర్భంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం-2026 థీమ్ అయిన “వన్ డ్రాప్ అఫ్ హ్యుమానిటీ . గివ్ బ్లడ్ . సేవ్ లివ్స్” సందేశాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు.

రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చనే అంశంపై పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విజయవాడ డివిజన్ అసిస్టెంట్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) డాక్టర్ ఎం. జైదీప్ రక్తదాతలకు స్వాగతం పలికి, రక్తదానానికి సంబంధించిన అపోహలు, వాస్తవాలపై వివరంగా ప్రసంగించారు. స్వచ్ఛంద రక్తదానం సమాజానికి అందించే సేవలను వివరిస్తూ రైల్వే ఉద్యోగులు మరింత చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈటిటీసీ ప్రిన్సిపల్ ఎ. సీతారాం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల జిల్లా యువజన సంక్షేమ అధికారి రెడ్ క్రాస్ సీఈఓ డాక్టర్ రమేష్ కొల్లేటి తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేసిన వారిని నిర్వాహకులు అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. శిబిరంలో ఈటిటీసీకి చెందిన మొత్తం 42 మంది రైల్వే ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా సేవ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు. కార్యక్రమం విజయవంతం కావడంలో బ్లడ్ బ్యాంక్ అధికారులు, నర్సింగ్ సిబ్బంది, పర్యవేక్షకులు విశేష కృషి చేశారు. ప్రతి రక్తదానం ఒకటి కంటే ఎక్కువ ప్రాణాలను రక్షించే అవకాశం కల్పిస్తుందనే సందేశంతో కార్యక్రమం ముగిసింది. సమాజంలో మరింత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.