Gattuppala | యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు

Gattuppala | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా గట్టుప్పల మండలంలోని రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రబీ సీజన్‌లో వ్యవసాయ పనులు ఉధృతంగా సాగాల్సిన కీలక సమయంలో, ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ యూరియా బుకింగ్ విధానం రైతుల పాలిట శాపంగా మారింది. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు దరఖాస్తు చేయలేక, ఉన్నవారు సైతం బుకింగ్ కాక నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సేవా కేంద్రానికి సరఫరా చేసిన యూరియా కేవలం 444 బస్తాలే కావడంతో, మండలంలోని రైతులంతా అక్కడికి చేరి గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. అయినా బుకింగ్ కాకపోవడంతో చాలామంది రైతులు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తుందో ఏమో అని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రైతుల అవసరాలను అంచనా వేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఒక ఎకరాకు రెండు బస్తాల యూరియా ఇవ్వాలని ప్రకటించినప్పటికీ, బుకింగ్ అయిన రైతులకు ఒక బస్తా ఇప్పుడే, మరో బస్తా 15 రోజుల తర్వాత ఇస్తామని చెప్పడం రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది.

పంటకు అవసరమైన సమయంలో ఎరువు అందకపోతే దిగుబడి రాక రైతుల నష్టపోతారని తెలిసిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఆన్లైన్ విధానం పేరుతో రైతులను కష్టాల్లో నెట్టివేసిన ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేసి,పాత పద్ధతిలోనే నేరుగా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply