జోడేఘాట్ లో కొమరం భీమ్ కు ఘన నివాళి..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొదమ సింహం కొమరం భీమ్ (Komaram Bheem) కు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం కొమరం భీమ్ జిల్లా కెరమేరి మండలం జోడేఘాట్లో కొమరం భీమ్ 85వ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా జోడేఘాట్లో కొమరం భీమ్ వారసులు, ఆదివాసి పెద్దలు సమాధి వద్ద సాంప్రదాయ పూజలు నిర్వహించి పెరస పెన్ కు మొక్కులు చెల్లించారు.
అనంతరం కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ ఆచారం మేరకు ఆదివాసి జెండాను ఆవిష్కరించారు. రాయి సెంటర్లు, ఆదివాసి గోండు పెద్దలు మాట్లాడుతూ.. హక్కుల కోసం తెగించి పోరాడిన కొమరం భీమ్ ఆశయాలు ఇప్పటికీ నెరవేరడం లేదని, తమ గ్రామాలకు కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల కోసం మరో ఉద్యమాలకు సిద్ధం కావాలని సూచించారు.

మంత్రి జూపల్లి నివాళులు..
రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసుల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం పోరాడిన మహాయోధుడు కొమరం భీమ్ త్యాగాలను స్మరించారు.
ఎన్నికల కోడ్ తో అధికారుల హడావిడి..
మంత్రులు, రాజకీయ నాయకులు జోడే ఘాట్ కు తరలివస్తున్నారన్న సమాచారం మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంది. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఐ టి డి ఏ పి ఓ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ అందరికంటే ముందుగా వెళ్లి కొమరం భీమ్ సమాధి వద్ద పూజలు నిర్వహించి నివాళులర్పించారు. హట్టి వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఆ తర్వాత కొమరం భీమ్ (Komaram Bheem) వారసులైన సోనేరావు వారి కుటుంబ సభ్యులను అధికారులు ఘనంగా సత్కరించి మర్యాద పూర్వకంగా నూతన వస్త్రాలను బహుకరించారు. కోడ్ అమలులో ఉండడంతో దర్బార్ ను రద్దు చేశారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎమ్మెల్సీ దండేవిటల్, మాజీ ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్యే వెడమ బొజ్జు, మంత్రుల వెంట వెళ్లి ఆదివాసి పోరు బిడ్డ కొమరం భీమ్ కు నివాళులర్పించారు.


