cyber fraud | ఇక అంతే సంగతులు.. సైబర్ పోలీసుల షాకింగ్ హెచ్చరిక!

cyber fraud | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్: 70 శాతం డిస్కౌంట్.. ఇప్పుడే త్వరపడండి, ఈ ఆఫర్‌ ఈ రోజు మాత్రమే! అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు.. ఇంట్లో నుంచే లక్షలు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ లింక్‌ క్లిక్‌ చేయండి. కస్టమర్‌ కేర్‌లో ఉద్యోగాలు.. ఇంట్లో కూర్చొని నెలకు రూ. 30 వేలు సంపాదించండి అనే ఆఫర్లు ఈ మధ్య కాలంలో మనం తరచూ సోషల్‌ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇవి నిజమనుకొని మీరు ఆ లింకులు క్లిక్‌ చేశారా.. అంతే, మీరు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడినట్లే! ఇలాంటి ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని, ఇవి సైబర్‌ నేరగాళ్ల నకిలీ ప్రకటనలు కావచ్చునని సైబర్‌ పోలీసులు సూచిస్తున్నారు.

సులభంగా డబ్బు సంపాదించవచ్చనే (ఈజీ మనీ) ఆశ చూపి సైబర్‌ నేరస్థులు ఇలాంటి ప్రకటనలతో మనల్ని ఆకర్షిస్తారు. ఆపై మన బ్యాంక్‌ అకౌంట్లలోని నగదును ఖాళీ చేసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి సోషల్‌ మీడియాలో ఏ ప్రకటన ఫేక్? ఏది నిజం అని ఎలా తెలుసుకోవాలి? అనేదే ఇప్పుడు అందరి ముందున్న ముఖ్యమైన ప్రశ్న. మనం సోషల్‌ మీడియాలోని లింక్స్‌ ద్వారా పేమెంట్స్ చేసేటప్పుడు కొన్ని చిన్న విషయాలను గమనిస్తే సైబర్‌ నేరగాళ్ల బారి నుంచి సులభంగా తప్పించుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.

ఇలాంటి మోసాల నుంచి రక్షణ పొందేందుకు ముఖ్యమైన సూచనలు:
Sponsored (ప్రకటన), సాధారణ సెర్చ్ ఫలితాల మధ్య తేడా గుర్తించండి: గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో వెతికేటప్పుడు డబ్బులు చెల్లించడం ద్వారా అందరికంటే పైన కనిపించే ‘Sponsored’ లింకులకు, సహజంగా వచ్చే సాధారణ ఫలితాలకు మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అధికారికతను నిర్ధారించుకోండి: ఏదైనా ఆన్‌లైన్ పేమెంట్ చేసే ముందు సదరు వెబ్‌సైట్ లేదా యాప్ అధికారికమైనదో, కాదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.

గుడ్డిగా నమ్మొద్దు: సోషల్ మీడియా లేదా వాట్సాప్‌లో కనిపించే లింక్‌లను గుడ్డిగా నమ్మకూడదు. ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా అఫీషియల్ యాప్ ద్వారానే సేవలు పొందాలి.

రహస్య వివరాలు పంచుకోవద్దు: మీకు ఏమాత్రం సందేహం వచ్చినా అలాంటి లింకులపై క్లిక్ చేయవద్దు. మీ ఓటీపీ (OTP), పిన్ (PIN) లేదా బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు.

ఒకవేళ సైబర్ మోసం జరిగితే ఏం చేయాలి?
మీరు పొరపాటున సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తం అవ్వండి.

-వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి.

-అధికారిక వెబ్‌సైట్ www.cybercrime.gov.in లో మీ ఫిర్యాదును నమోదు చేయండి.