పోచమ్మ ఆలయం ముందు చెత్త కుప్పలు..

పోచమ్మ ఆలయం ముందు చెత్త కుప్పలు..

  • పట్టించుకోని అధికారులు, ఆవేదనలో గ్రామస్తులు

వెల్గటూర్, ఆంధ్రప్రభ : ముక్కోటి దేవతలకన్నా ముందుగా పోచమ్మ తల్లిని పూజించే సంప్రదాయం ఉన్నా, ఆ తల్లి ఆలయం ముందు పేరుకుపోయిన చెత్తను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని జగిత్యాల రహదారిని ఆనుకుని ఉన్న పోచమ్మ తల్లి ఆలయం ముందు గత కొన్ని నెలలుగా చెత్త కుప్పలు పేరుకుపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. గ్రామ సభల్లో పలుమార్లు ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా, గ్రామంలోని అనేక సమస్యలు యథాతథంగా కొనసాగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని విమర్శిస్తున్నారు.

ఆలయం ముందు చెత్త వేయడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని, ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమల వ్యాప్తి పెరిగి ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆలయం ముందు ఉన్న చెత్తను తొలగించడంతో పాటు గ్రామంలో నెలకొన్న పారిశుధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.